vipanchi

vipanchi

2, డిసెంబర్ 2013, సోమవారం

చీకటుల పాట!!!

ఏదో విషాదరేఖ!
ఇంటిలో దూరి ఎల్లెడా
తిరుగుతూ భయపెట్టే నల్లతాచులా,
అల్లనల్లన నా మనసు పొరల్లో చొచ్చి మెలితిరుగుతూ పోతోంది!

తొలినాళ్ళలో నిజానికి నేనేదో దుఃఖలోక నివాసిని...
నాకక్కడ ఇళ్ళువాకిళ్ళుకూడా ఉన్నాయి, సొరిగిపోని స్థిరాస్తులై....
నా చిట్టిగొంతు మలచుకున్న ఏదో చీకటులపాట
పాడిపోయేందుకేమో ఈ చోటికొచ్చి తచ్చాడుతున్నాను....

రాగమైతే కుదురుతోంది కాని,
అక్షరాలుగా ఒలకబోద్దామనుకున్న వేదనకి మాటలు దొరక్క,
ఏవో కరుణాక్షరాలని కూర్చుకుంటూ గొంతులోనే కొట్టుమిట్టాడుతోంది.....


14, నవంబర్ 2013, గురువారం

ఓ రాతిరి!

ఉలికి ఉలికి పడుతోంది,
ఏదో చెప్పాలని పదాలు వెతుక్కుంటోంది....

అదీ, ఇదీ అనుకుంటూ ముళ్ళు పెట్టుకుంటోంది,
కొన్ని తేలిగ్గా లాగెయ్యగల ఉచ్చు ముళ్ళు,
కొన్ని విప్పలేని పీటముళ్ళు, లాగేకొద్దీ బిగుసుకునే చిక్కుముళ్ళు.....

అల్లిబిల్లిగా అల్లుకుపోతున్న ఆలోచనల వలలు,
చిక్కుబడి కాలుసాగక స్థబ్దుగా నిలిచిపోతోంది.
రాతిరి దొర్లిపోతోంది, జాబిలి వడివడిగా ఆదరికేసి జరిగిపోతోంది...
మబ్బులు ఎవరో తరుముతున్నట్టు అటూ,ఇటూ పరుగులెడుతున్నాయి.....

తను మాత్రం నిలిచిపోయింది,
వెనక్కి వెనక్కి జరిగిపోతోంది...
అవి ఏవో తెలియని చీకట్లలోకి,
నల్లగా మూసుకుపోతున్న దిగంతాలలోకి.........